||సుందరకాండ ||

||నలభైనాలుగొవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 44 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుశ్చత్వారింశస్సర్గః||

సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలీ|
జంబుమాలీ మహదంష్ట్రో నిర్జగామ ధనుర్ధరః||1||

స|| ప్రహస్తస్య సుతః మహాదంష్ట్రః ధనుర్ధరః బలీ జంబుమాలి రాక్షసేంద్రేణ సందిష్టః నిర్జగామ||

ప్రహస్తుని పుత్రుడు మహత్తరమైన కోరలు గలవాడు ధనస్సు ధరించినవాడు బలవంతుడు అగు జంబుమాలి రాక్షసేంద్రుని అదేశించబడినవాడై అక్కడనుంచి వెళ్ళెను.

రక్తమాల్యాబరధరః స్రగ్వీ రుచిరకుండలః|
మహాన్వివృత్తనయనః చండః సమరదుర్జయః||2||
ధనుశ్శక్రధనుః ప్రఖ్యం మహద్రుచిరసాయకమ్|
విష్ఫారయాణో వేగేన వజ్రాశనిసమస్వనమ్||3||
తస్య విష్ఫా ర ఘోషేణ ధనుషో మహతా దిశః|
ప్రదిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యత||4||

స|| ( సః) రక్తమాల్యాంబరధరః స్రగ్వీ రుచిరకుణ్డలః మహాన్వివృత్తనయనః సమరదుర్జయః|| (సః) మహత్ రుచిరసాయకం శక్రధనుః ప్రఖ్యం ధనుః వజ్రాశనిసమస్వనమ్ వేగేన విష్ఫారయణః (నిర్జగామ) || తస్య ధనుషో మహతా విష్ఫారఘోషేణ దిశః ప్రదిశశ్చైవ నభశ్చైవ సహసా సమపూర్యత||

ఆ జంబుమాలి ఎఱ్ఱనిపూల మాలలూ వస్త్రములు ధరించినవాడు. చెవులకు మంచి కుండలములు ధరించినవాడు. పెద్దగా కళ్ళు గిరగిరా తిప్పుతున్నవాడు. సమరములో దుర్జయుడు. అతడు శక్తిమంతమైన బాణములను ప్రయోగించు ఇంద్రధనస్సుపోలిన ధనస్సుతో , వజ్రాయుధము పోలిన భయంకరమైన ధనుష్టంకారములు చేయుచూ వేగముగా యుద్ధమునకు వెళ్ళెను. అతని ధనస్సుయొక్క భీషణ నాదములు అన్ని దిశలనూ అకాశమునూ పూర్తిగా నింపినవి.

రథేన ఖరయుక్తేన తమాగతముదీక్ష్య సః|
హనుమాన్ వేగసంపన్నో జహర్ష చ ననాద చ||5||
తం తోరణ విటంకస్థం హనుమంతం మహాకపిమ్|
జంబుమాలీ మహాబాహుర్వివ్యాథ నిశితైశ్శరైః|| 6||

హనుమాన్ వేగసంపన్నః రథేన ఖరయుక్తేన ఆగతం తం ఉదీక్ష్య జహర్ష చ ననాద చ||జంబుమాలి మహాబాహుః నిశితైః శరైః తం తోరణ విటంకస్థం మహాకపిం హనూమంతం వివ్యాథ ||

వేగమే సంపదగా గల హనుమంతుడు గాడిదలు పూన్చిన రథముపై ఎక్కి వచ్చుచున్న వానిని చూచి సంతోషముతో గొప్ప నాదము చేసెను. మహాబాహువులు కల జంబుమాలి నిశితమైన బాణములతో ఆ తోరణము ఎక్కి కూర్చునివున్న మహాకపిపై ప్రయోగించెను.

అర్థ చంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణినా|
బాహోర్వివ్యాథ నారాచైర్దశభిస్తం కపీశ్వరమ్||7||
తస్త తచ్ఛుశుభే తామ్రం శరేణాభిహతం ముఖమ్|
శరదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మినా||8||
తత్తస్య రక్తం రక్తేన రంజితం శుశుభే ముఖమ్|
యథాకాశే మహపద్మం సిక్తం చందన బిందుభిః||9||

స|| అర్థ చంద్రేణ వదనే ఏకేన కర్ణినా శిరసి దశాభిః నారాచైః బాహ్వోః తం కపీశ్వరం వివ్యాథ||శరేణ అభిహతం తామ్రం తత్ ముఖం శరది భాస్కరేణ విద్ధం ఫుల్లం అమ్బుజమ్ ఇవ శుశుభే|| రక్తేన రంజితం రక్తం తస్య తత్ ముఖం చందనాబిందుభిః సిక్తం ఆకాశే మహాపద్మం యథా శుశుభే||

అర్థ చంద్రాకారము కల బాణమును ముఖము మీద ఒకటి, వంకరములికి వున్న బాణమును శిరస్సుపై, పది బాణములు బాహువులపై ప్రయోగించి ఆ వానరుని బాధించెను. ఆ శరములచే కొట్టబడిన హనుమంతుని ఆ ఎర్రని ముఖము శరత్కాల సూర్య కిరణములచే వికసింపబడిన ఎఱ్ఱతామర పూవు వలె భాసించెను. ఆ ఎఱ్ఱని రక్తముతో రంజితమైన ఆయన ముఖము ఆకాశమున రక్త చందన బిందువులతో రంజితమైన మహా పద్మము వలె భాసించెను.

చుకోప బాణాభిహతో రాక్షసస్యమహాకపిః|
తతః పార్శ్వేsతివిపులాం దదర్శ మహతీం శిలామ్|10|||
తరసా తాం సముత్పాట్య చిక్షేప బలద్బలీ|
తాం శరైర్దశభిః క్రుద్ధః తాడయామాస రాక్షసః||11||

స|| బాణాభిహితః మహాకపిః రాక్షసస్య చుకోప | తతః పార్శ్వే అతివిపులం మహతీం శిలాం దదర్శ| బలీ తాం తరసా సముత్పాట్య బలవత్ చిక్షేప | రాక్షసః క్రుద్ధః తాం దశాభిః శరైః తాడయామాస||

రాక్షస బాణములచే కొట్టబడిన హనుమంతుడు ఉద్రేకుడు అయ్యెను. అప్పుడు తనపక్కన అతివిపులమైన శిలను చూచెను. ఆ బలవంతుడు ఆ శిలను పైకి ఎత్తి బలముతో విసిరెను. ఆ రాక్షసుడు దానిని పది బాణములతో ఛిన్నాభిన్నము చేసెను.

విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాంశ్చండవిక్రమః|
సాలం విపులముత్పాట్య భ్రామయామాస వీర్యవాన్||12||
భ్రామయంతం కపిం దృష్ట్వా సాలవృక్షం మహాబలమ్|
చిక్షేప సుబహూన్ బాణాన్ జంబుమాలీ మహాబలః||13||
సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభిర్భుజే|
ఉరస్యేకేన బాణేన దశభిస్తు స్తనాంతరే||14||

స|| చణ్డవిక్రమః వీర్యవాన్ హనుమాన్ తత్ కర్మ విపన్నం దృష్ట్వా విపులం సాలం ఉత్పాట్య భ్రామయామాస|| సాలవృక్షం భ్రామయంతం మహాబలం కపిం దృష్ట్వా జంబుమాలీ మహాబలః సుబహూన్ బాణామ్ చిక్షేప||సాలం చతుర్భిః చిచ్ఛేద వానరం పంచభిః భుజే ఉరసి ఏకేన బాణేన స్తనాంతరే దశభిః చిచ్ఛేద||

చండవిక్రముడు వీరుడు అగు హనుమంతుడు ఆ పని విఫలము కావడము చూచి, ఒక పెద్ద సాలవృక్షమును పెకిలి దానిని గిరగిరా తిప్పసాగెను. ఆ సాలవృక్షమును గిర గిరా తిప్పుతున్న ఆ వానరుని చూచి మహాబలుడైన జంబుమాలి అనేక మైన బాణములను ప్రయోగించెను. నాలుగు బాణములతో సాల వృక్షమును, వానరుని భుజముల మీద ఇదు బాణములతో, ఉదరము పై ఒకబాణముతో వక్షస్థలముపై పది బాణములతో ఛేధించెను.

స శరైః పూరిత తనుః క్రోధేన మహతావృతః|
తమేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగతః||15||
అతివేగోsతివేగేన భ్రామయిత్వా బలోత్కటః|
పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసి||16||

స|| శరైః పూరిత తనుః సః మహతా క్రోధేన వృతః వేగితః తం పరిఘమేవ గృహ్య భ్రామయామాస ||బలోత్కటః అతివేగః పరిఘం అతివేగేన భ్రామయిత్వా జంబుమాలే మహోరసి పాతయామాస||

శరములతో నిండిన తనువు గల అతడు మహత్తరమైన క్రోధముతో వేగముగా అపరిఘనే తీసుకొని గిర గిరా తిప్పసాగెను. సాటిలేని పరాక్రమము గల వాడు అతివేగము గలవాడు అగు హనుమంతుడు పరిఘను అతివేగముగా తిప్పుచూ జంబుమాలి వక్షస్థలముపై కొట్టసాగెను.

తస్య చైవ శిరోనాస్తి న బాహూ న చ జానునీ|
న ధనుర్నరథో నాశ్వాస్త్రత్రాదృశ్యంత నేషవః||17||
స హతః సహసాతేన జంబుమాలీ మహాబలః|
పపాత నిహతో భూమౌ చూర్ణితాంగవిభూషణః||18||

స|| తత్ర తస్య శిరః చైవ నాస్తి| బాహూ న | జానునీ న| ధనుః న | రథః న | అశ్వాః నాదృశ్యంతః |ఇషవః న||జంబుమాలీ మహాబలః సహసా తేన హతః నిహతౌ చూర్ణితాంగవిభూషణః భూమౌ పపాత||

అప్పుడు ఆ దెబ్బతో అక్కడ వాడి శిరస్సులేదు. బాహువులు లేవు. జానువులు లేవు. ధనస్సు లేదు. రథములేదు. అశ్వములు కూడా కనపడుటలేవు. మహాబలవంతుడైన జంబుమాలి వానరునిచేత హతమార్చబడి, అంగములన్నీ చూర్ణము చేయబడినవాడై భూమి మీద పడెను.

జంబుమాలిం చ నిహతం కింకరాంశ్చ మహాబలాన్|
చుక్రోధ రావణః శ్రుత్వా కోపసంరక్తలోచనః||19||

స|| రావణః మహాబలాన్ కింకరాంశ్చ జంబుమాలిం చ నిహతం శ్రుత్వా కోపసంరక్త లోచనః చుక్ర్రోధ||

రావణుడు మహాబలవంతులైన కింకరులు అలాగే జంబుమాలి కూడా హతమార్చబడడము విని కోపముతోఎఱ్ఱబడిన కళ్ళు కలవాడు అయ్యెను.

స రోషసంవర్తిత తామ్ర లోచనః
ప్రహస్తపుత్రే నిహతే మహాబలే|
అమాత్యపుత్రాన్ అతివీర్యవిక్రమాన్
సమాదిదేశాశు నిశాచరేశ్వరః||20||

స|| సః నిశాచరేశ్వరః రోషసంవర్తిత తామ్రలోచనః మహాబలే ప్రహస్తపుత్రే నిహతే అమాత్యపుత్రాన్ అతివీర్య విక్రమాన్ ఆశు సమాదిదేశ ||

ఆ నిశాచరేశ్వరుడు రోషముతో ఎఱ్ఱని కళ్ళు కలవాడై మహాబలుడైన ప్రహస్తుని పుత్రుడు హతమార్చబడడముతో మహావీరులు అగు అమాత్యపుత్రులకు వెంటనే ఆదేశము ఇచ్చెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుశ్చత్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైనాలుగొవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||